: కోడెల గారూ...వృథా ఎందుకండి?: తాత్కాలిక అసెంబ్లీ ప్రతిపాదనకు చంద్రబాబు తిరస్కారం


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నెలన్నరలో నిర్మించాలన్న తాత్కాలిక అసెంబ్లీ ప్రతిపాదనకు సీఎం నారా చంద్రబాబునాయుడు నుంచి తిరస్కారం ఎదురైంది. త్వరలోనే శాశ్వత అసెంబ్లీ అందుబాటులోకి రానున్నందున తాత్కాలిక భవనాల పేరిట వృథా ఖర్చు ఎందుకంటూ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తనను కలిసిన స్పీకర్ తో చంద్రబాబు తాత్కాలిక భవన నిర్మాణాన్ని విరమించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తుళ్లూరు సమీపంలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించుకునే విషయాన్ని పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. సమావేశాల నిర్వహణ, సభ్యులకు వసతి తదితరాలకు హాయ్ ల్యాండ్ సరిగ్గా సరిపోతుందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేవలం రెండేళ్ల కాల పరిమితి కోసం తాత్కాలిక భవనాల నిర్మాణం అంటే, ప్రజా ధనం వృథా అయినట్లే కదా? అన్న ధోరణిలో చంద్రబాబు ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. భేటీ ముగిసిన తర్వాత స్పీకర్ కోడెల మీడియాతో మాట్లాడుతూ సీఎం సూచనతో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను హైదరాబాదులో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాలను మాత్రం హాయ్ ల్యాండ్ లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News