: ‘గాలి’ బళ్లారికి వెళ్లాలంటే మరో వారం ఆగాల్సిందే... విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
తన సొంతూరు బళ్లారికి వెళ్లేందుకు అక్రమ గనుల వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరో వారం పాటు ఆగక తప్పని పరిస్థితి నెలకొంది. వారం రోజులు ఆగినా, ఆయన బళ్లారిలో కాలు మోపుతారన్న గ్యారెంటీ కూడా లేదు. షరతులతో కూడిన బెయిల్ పొందిన జనార్దన్ రెడ్డి, సదరు షరతులను సడలించాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. గాలి పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు వారం రోజుల వ్యవధి కావాలని సీబీఐ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీంతో కేసును వారం పాటు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. దీంతో బళ్లారి వెళ్లే విషయంపై తేలాలంటే గాలి జనార్దన్ రెడ్డి మరో వారం పాటు ఆగాల్సిందేనన్నమాట.