: ఎన్నాళ్లో వేచిన ఉదయం... భావోద్వేగాల మధ్య ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన గీత


దాదాపు 15 సంవత్సరాల క్రితం పొరపాటున సరిహద్దులు దాటి పాకిస్థాన్ చేరుకున్న మూగ, బధిర బాలిక గీత కరాచీ నుంచి ఇండియాకు బయలుదేరింది. సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగీ భాయిజాన్' చిత్రం విడుదలైన తరువాత, దాదాపు అదే విధమైన కథను నిజ జీవితంలో కలిగిన గీత ఉదంతం తెరపైకి రాగా, ఆమెను ఎలాగైనా తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని భారత విదేశాంగ శాఖ, మీడియా తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే. గీత తమ బిడ్డేనని పలు రాష్ట్రాల నుంచి ఎందరో బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ముందుకు రాగా, అధికారులు వారందరి ఫోటోలనూ సేకరించి పాకిస్థాన్ కు పంపారు. వీటిని చూసిన గీత, తన తల్లిదండ్రులను గుర్తు పట్టగా, మిగిలిన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. మరికాసేపట్లో ఢిల్లీ విమానాశ్రయంలో గీత ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం దిగనుంది. గీతతో పాటు ఆమెకు ఆశ్రయమిచ్చిన ఈదీ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా వస్తున్నారు. వీరందరినీ భారత ప్రభుత్వ అతిథులుగా గౌరవిస్తామని మోదీ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. బీహార్ లో ఉన్న గీత తల్లిదండ్రులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తరువాతే ఆమెను అప్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, గీతను ఆహ్వానించేందుకు ఆమె తండ్రి జనార్దన్ మహతో ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు గీత బయలుదేరే సమయంలో ఈదీ ఫౌండేషన్ లో భావోద్వేగాలు నిండిపోయాయి. పలువురు గీతను వదిలి వుండలేక కన్నీరు కార్చారు. ఆమెకు బహుమతులు ఇచ్చి పంపారు.

  • Loading...

More Telugu News