: జనం ఏం తినాలో ‘కర’ సేవకులను అడగాలా?...ఆరెస్సెస్ పై వీహెచ్ ఘాటు విమర్శలు
బీజేపీ సిద్ధాంతకర్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఒంటికాలిపై లేచారు. 'జనం ఏం తినాలో కర సేవకులను అడగాలా?' అంటూ ఆయన నిన్న ఢిల్లీ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. దేశంలో మతాల పేరిట విభజన జరుగుతోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధపు మాటలతో ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేజిక్కించుకున్నారని కూడా వీహెచ్ ఆరోపించారు. ‘‘జనం ఏం తినాలో ఆరెస్సెస్ ను అడగాలా? ఎవరింట్లో ఏం వండుకోవాలో ఆ సంస్థ నిర్ణయించే దుస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో మటన్ తినాలన్నా, కూరగాయలు తినాలన్నా.. వారి ఆమోదం తీసుకోవాల్సి వస్తుంది’’ అని వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయించేందుకు ఆరెస్సెస్ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బీహార్ లో బీజేపీ గెలిస్తే ఇదే జరుగుతుందని చెప్పిన ఆయన, ఎన్డీఏకు ఓటేయవద్దని బీహారీ ఓటర్లకు పిలుపునిచ్చారు.