: బంగారానికి దూరంగా భారతీయులు, భారీగా తగ్గిన అమ్మకాలు!
ప్రస్తుత పండగ సీజనులో బంగారం అమ్మకాలు అంతంతమాత్రంగా సాగుతుండటం జ్యూయలరీ వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు నెలల క్రితం రూ. 25 వేల దిగువకు వచ్చిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ. 27 వేల ఎగువన కొనసాగుతుండటమే ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా దసరా మొదలు, ధన్ తేసర్, దీపావళి ముగిసేలోగా ఇండియాలో బంగారం అమ్మకాలు భారీగా సాగుతుంటాయి. దసరా సీజనులో 52 టన్నుల బంగారం దిగుమతి నమోదవుతుందని ఇండస్ట్రీ అంచనా వేయగా, కేవలం 45 టన్నులు మాత్రమే దిగుమతి అయింది. అంతకుముందు ఆగస్టులో 32 టన్నులు, సెప్టెంబరులో 36 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న చిన్న జ్యూయలర్స్ అమ్మకాలు భారీగా తగ్గాయని, తగ్గింపు ధరలకు బంగారాన్ని ఆఫర్ చేస్తున్నా కొనేవారు లేరని బులియన్ నిపుణులు వ్యాఖ్యానించారు. బంగారం ధర రూ. 25 వేల వద్ద ఉన్నప్పుడు కొనుగోళ్లు జరిపిన ఆభరణాల వ్యాపారులు, ప్రస్తుత మార్కెట్ ధరపై గ్రాముకు 100 రూపాయల వరకూ తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నారు. అయినా, వ్యాపారం సాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. కాగా, ముంబైలోని జవేరీ బజారులో 10 గ్రాముల బంగారం ధర రూ. 26,920 వద్ద ఉంది.