: పాక్ ఆక్రమిత కాశ్మీరులో పాక్ కు వ్యతిరేకంగా 'బ్లాక్ డే'
పాక్ ఆక్రమిత కాశ్మీరు (పీఓకే)లో ఆ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ పీఓకేలో 22న 'బ్లాక్ డే'ను పాటించింది. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 1947, అక్టోబర్ 22న పాక్ సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడి, అవిభాజ్య జమ్మూకాశ్మీర్ లో సాధ్యమైనంత ఆక్రమించుకోవాలని ప్రయత్నించి, ముజఫరాబాద్ లో కాలుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అది పాక్ ఆక్రమిత కాశ్మీరుగా గుర్తింపు పొందగా, ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే వుంది. బ్లాక్ డే సందర్భంగా, ముజఫరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఫెడరేషన్ నేత అఫ్జల్ సులేరియా ప్రసంగిస్తూ, పాక్ సైన్యం తమపై దాడులు చేస్తుండటాన్ని తప్పుబట్టారు. పాక్ పాలన ఘోరంగా సాగుతోందని ఆరోపించిన ఆయన, తక్షణం పాక్ సైన్యం తమ భూభాగం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజలను పాక్ సైనికులు హత్య చేస్తున్నారని, దోచుకుంటున్నారని, వారి ఆగడాలకు అంతు లేకుండా పోయిందని ఆరోపించారు. కాగా, పాక్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.