: టెస్టుల్లో పింక్ బాల్ వినియోగంపై ఆందోళన
టెస్టుల్లో వినూత్న ప్రయోగంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. టెస్టులంటే పగటి పూట జరిగేవిగా అందరికీ తెలుసు. టెస్టులపై నానాటికీ ఆసక్తి తగ్గిపోతుండడంతో, తీవ్రంగా ఆలోచించిన ఐసీసీ అభిమానులకు డే నైట్ టెస్టు మ్యాచ్ లను పరిచయం చేయనుంది. ఈ డేనైట్ టెస్టులను నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 మధ్య ఒవల్ మైదానంలో ప్రయోగాత్మకంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్వహించనున్నారు. కాగా, ఈ టెస్టులో పింక్ బాల్ ను వినియోగించనున్నారు. పింక్ బాల్ వినియోగంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పింక్ బాల్ సత్ఫలితాలు ఇవ్వడం లేదని ఆసీస్ ఆటగాడు ఆడమ్ వోజెస్ తెలిపాడు. తాము ఆడిన ఫ్రెండ్షిప్ సిరీస్ లో ప్రయోగాత్మకంగా పింక్ బాల్ వాడగా, మొదట్లో బంతి బాగున్నా రానురాను మెత్తబడిపోతోందని అన్నాడు. అలాగే బంతి రంగును కూడా తొందరగా కోల్పోతుందని, దీంతో బ్యాట్స్ మన్ కు కనిపించడం లేదని వోజెస్ చెప్పాడు. ఆస్టన్ ఆగర్ సంధించిన బంతిని గుప్తిల్ మిడ్ వికెట్ దిశగా షాట్ కొడితే అది ఏ దిశలో వెళ్లిందో కూడా తెలియలేదని వోజెస్ వెల్లడించాడు. దీంతో మరోసారి పింక్ బాల్ పై చర్చకు తెరలేచింది.