: ఇద్దరు సీఎంల వ్యవహారం...దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా ఉంది: టీ కాంగ్ నేత జీవన్ రెడ్డి ఫైర్


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల మధ్య ఆత్మీయ పలకరింపులు, వరుస భేటీలపై టీ కాంగ్రెస్ నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ ఉపనేత జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఇద్దరు సీఎంల వ్యవహారం ఉందని ఆయన ధ్వజమెత్తారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ఇద్దరు సీఎంల భేటీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ లపై ఒకరిపై మరొకరు పరుష పదజాలంతో విమర్శలు గుప్పించుకున్న ఇద్దరు సీఎంలు ఆ తర్వాత ఎలా కలిసిపోయారని ఆయన ప్రశ్నించారు. సీఎంల హోదాలో కలిస్తే కలిశారు గాని, ఆ రెండు కేసుల దర్యాప్తు ఏమైందో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కేసులను పక్కనబెట్టుకునేందుకు ఇద్దరు సీఎంలు రాజీపడ్డారని ఆయన ఆరోపించారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకే ప్రధాని నరేంద్ర మోదీ నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్లుగా ఉందని కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News