: 300 మంది అమ్మాయిలను ఎలా మోసం చేశాడంటే...!
300 మంది యువతులను మోసం చేసిన మాజీ ఎఫ్ సీఐ ఉద్యోగి మధుని షీటీమ్స్ అధికారులు హైదరాబాదులో మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం అతను మోసం చేసిన విధానాన్ని హైదరాబాదు డీసీపీ స్వాతి లక్రా వివరించారు. ఆ వివరాలు... 2011లో ఎఫ్ సీఐ అసిస్టెంట్ మేనేజర్ గా హైదరాబాదు వచ్చిన మధు, 2012 నుంచి అమ్మాయిలను మోసం చేయడం ప్రారంభించాడు. కేవలం ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను అమ్మాయిలపై వల వేసి సోషల్ మీడియా ఆధారంగా వారిపై వేధింపులకు పాల్పడేవాడు. కెరీర్ ఎడ్యుకేషనల్ సర్వీస్ పేరుతో కన్సల్టెన్సీ ఓపెన్ చేశానని, విద్యకు సంబంధించిన సలహాలు ఇస్తానని చెప్పి సుమారు 300 మంది అమ్మాయిలను మోసం చేశాడని డీసీపీ చెప్పారు. ఇతను కేవలం అమ్మాయిల కోసం 13 రిజిస్టర్లు మెయింటైన్ చేశాడు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, వొడాఫోన్... ఇలా ఫోన్ సర్వీస్ ఆధారంగా ఒక్కో రిజిస్టర్ పెట్టుకున్నాడు. అలా మొత్తం 13 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఈ 13 రిజిస్టర్లలో సుమారు 5,000 మంది అమ్మాయిల పేర్లు నమోదై ఉన్నాయని వారు వివరించారు. అలాగే మూడు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా వారిని ముగ్గులోకి లాగే వాడని, అతని ఛాట్ లు కూడా అతని అరెస్టులో కీలక పాత్ర పోషించాయని పోలీసులు వెల్లడించారు. రిజిస్టర్ లోని అమ్మాయికి ఫోన్ చేసేవాడని, ఆ సమయంలో స్టూడెంట్ కానీ, తల్లిదండ్రులు కానీ అతనికి వార్నింగ్ ఇస్తే వారి పేరు ఎదురుగా 'డేంజర్' అని రాసుకునే వాడని వారు తెలిపారు. కొంత మంది పేరు ఎదుట 'వేస్ట్' అని రాశాడని, మరి కొంత మంది పేరు ఎదుట 'ఓవర్' అని రాశాడని అలా సుమారు 300 నుంచి 500 మందిని మోసం చేసి ఉంటాడని అంచనా వేస్తున్నామని డీసీపీ తెలిపారు. అమ్మాయిలతో ఫోన్ లో ఛాటింగ్ చేయడానికి, టెంట్లు వేసుకుని సిమ్ కార్డులమ్మే వారి నుంచి 14 సిమ్ కార్డులు తీసుకున్నాడు. వారే అతనికి దొంగ అడ్రెసులు సమకూర్చారు. వాటితో అతను మరో చోట 6 సిమ్ కార్డులు తీసుకున్నాడు. వాటితోనే అతను మోసాలు ప్రారంభించాడని ఆమె చెప్పారు. ఇతనిపై 2013లో సైఫాబాద్ లో ఒకటి, 2014లో హయత్ నగర్, కుషాయి గూడలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోలీసులను రాచకొండ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి పేర్లతో తప్పుదోవ పట్టించాడని డీసీపీ తెలిపారు. ఇతని సొంత ఊరు నల్గొండ జిల్లా మిర్యాల గూడ అని చెప్పారు. రెండు అద్దె ఇళ్లు తీసుకుని ఇతనీ మోసాలు చేశాడని ఆమె వివరించారు. ఎవరైనా ఎదురు తిరిగితే తను తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడని, అలా చాలామందిని చాలా సార్లు మోసం చేశాడని చెప్పారు. అతని నుంచి సీపీయూ, ల్యాప్ టాప్, 19 మొబైల్స్, కొన్ని పెన్ డ్రైవ్ లు, 13 రిజిస్టర్లు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకుని, సీజ్ చేశామని చెప్పారు. అతనిపై గాంధీ నగర్, బోయిన్ పల్లి పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అతనిపై పీడీ యాక్టుపై కేసు నమోదు చేశామని తెలిపారు. అమ్మాయిలు తల్లిదండ్రులకు ఇలాంటి వారి గురించి వివరంగా చెప్పాలని, లేని పక్షంలో మోసాలకు గురవుతాని సూచించారు. ఇతని బారిన పడిన వారు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీసీపీ స్పష్టం చేశారు.