: యువతీ యువకుల మధ్య 'బంధం' తెగడానికి కారణాలివే!


రోజురోజుకూ మారుతున్న జీవన పరిస్థితులు, యువతీ యువకుల మధ్య డేటింగ్ బంధాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఈ విషయంలో పురుషుల్లో అత్యధికులు ఎవరో ఒకరు తమకు దొరికితే చాలని భావిస్తుండగా, మహిళలు మాత్రం ఎన్నో అంశాలను పరిశీలించిన తరువాతనే పచ్చజెండా ఊపుతున్నారు. ఆపై కూడా మధ్యలోనే తెగిపోతున్న బంధాలెన్నో. భాగస్వామి ఎంపికలో తప్పు చేశామని భావిస్తున్న వారిలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్యే అధికంగా ఉంది. యువతీ యువకుల మధ్య బంధం తెగడానికి గల కారణాలపై యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ సిడ్నీ ప్రొఫెసర్ పీటర్ కే జాన్సన్ నేతృత్వంలోని బృందం అధ్యయనం చేసి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించగా, ఆ వివరాలను 'పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ' పత్రిక ప్రచురించింది. తన భాగస్వామి గురించి అన్ని విషయాలూ తెలుసుకోకుండా ముందడుగు వేయడం ద్వారా ఆత్మహత్యలు, రోగాలు కొనితెచ్చుకోవడం, గర్భాన్ని తొలగించుకోవాల్సి రావడం వంటి తప్పులను యువతులు చేస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. ఓ డేటింగ్ డీల్ రద్దు చేసుకోవాలన్న ఆలోచన ముందుగా యువతుల్లోనే కలుగుతోందని, సరైన సమాచారం లేకుండా తప్పటడుగు వేశామన్న భావన వారిలో పుట్టడమే ఇందుకు కారణమని తెలిపింది. 21 నుంచి 76 సంవత్సరాల మధ్య ఉన్న 5,541 మందిని అధ్యయనంలో భాగం చేసి వారి 'వైవాహిక లేదా డేటింగ్ డీల్ బ్రేక్'కు కారణాలను రీసెర్చర్లు అన్వేషించారు. ఇందులో భాగంగా 17 అంశాలు వెలుగులోకి వచ్చాయి. లేజీగా ఉండటం, లైంగికానందాన్ని ఇవ్వలేకపోవడం, మరొకరితో సంబంధాన్ని పెట్టుకోవడం, ముభావంగా ఉండటం, అతిగా మాట్లాడటం, ఇంతకుముందే పిల్లల్ని కలిగుండి ఆ విషయాన్ని దాచడం వంటివి డీల్ బ్రేక్ కు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక మద్యం సేవించడం, ఆకర్షణీయ శరీరాకృతి లేకపోవడం, గంటల కొద్దీ భాగస్వామిని వీడి ఉండటం వంటి కారణాలతోనూ జంటలు విడిపోతున్నాయి. టీవీలకు అతుక్కుపోయి తమను పట్టించుకోకపోవడం, వీడియో గేములు అధికంగా ఆడటం, రాత్రుళ్లు సరిగ్గా స్పందించకపోవడం వంటి కారణాలతో అటు యువతులు, ఇటు పురుషులు తమ భాగస్వాములతో బంధాన్ని తెంపుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News