: బాబు మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే వచ్చినట్టుంది!: మోదీ పర్యటనపై నల్లపురెడ్డి ఫైర్
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసేందుకు వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా గానీ, ప్రత్యేక ప్యాకేజీ గానీ ప్రకటించకుండా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మోదీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తెర తీసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం నారా చంద్రబాబునాయుడి మనవడు దేవాన్ష్ తో ముచ్చట్లు పెట్టేందుకు ప్రధాని అమరావతికి వచ్చినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. నిన్నటి కార్యక్రమంలో నారా లోకేశ్ కొడుకును చూసిన మోదీ, అతడి వద్దకు వచ్చి బాలుడిని ముద్దు చేశారు. తన కళ్ల జోడు తీసి అతడికి పెట్టారు. ఈ సన్నివేశాన్ని ప్రస్తావించిన నల్లపురెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఏం చేశారని మోదీని ప్రశ్నించారు.