: రైలు టికెట్ కొంటే... బెర్త్ కన్ఫర్మ్!
నవంబర్ 1 నుంచి రైల్వే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులందరికీ బెర్తులను చూపించే దిశగా రైల్వే శాఖ ప్రారంభించనున్న పైలట్ ప్రాజెక్టు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ ప్రాజెక్టు వివరాలను, అమలు చేయాల్సిన తీరుపై ఇప్పటికే రైల్వే శాఖ నుంచి అన్ని జోనల్ కార్యాలయాలకూ ఆదేశాలు వెళ్లాయి. వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులకు తొలుత అదే ట్రైన్ లో అదనపు బోగీలను కలపడం ద్వారా బెర్తులను ఇవ్వాలని, అదనపు బోగీలను కలిపినప్పటికీ, ఇంకా ప్రయాణికులు మిగిలివుంటే, వారిని అదే రూట్లో తదుపరి ప్రయాణించే రైళ్లలో ప్రయాణానికి అనుమతించి, బెర్తులను ఇవ్వాలని నిర్ణయించారు. ఇక రద్దీ సమయాల్లో 200కు పైగా టికెట్లు బుక్ అయివుంటే, మరో రైలును అదే రూట్లో అప్పటికప్పుడు ప్రకటిస్తారు. ఆ రైలులో మిగిలివున్న టికెట్లను కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయిస్తారు. ఈ విధానమంతా ఇప్పటికే ప్రకటించగా, ఇప్పడో కొత్త ఆప్షన్ ను జోడించారు. టికెట్ కొనుగోలు చేసిన స్టేషన్ నుంచి కాకుండా, మరే ఇతర స్టేషన్ నుంచైనా ప్రయాణించేందుకు అంగీకరిస్తే, (అంటే... ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లేందుకు చెన్నై ఎక్స్ ప్రెస్ రైలులో రిజర్వేషన్ చేయించుకున్న వారు, ఆ రైలులో బెర్త్ కన్ఫర్మ్ కాకుంటే, కాచిగూడ నుంచి చెన్నై వెళ్లే రైలులో వెళ్లేందుకు సమ్మతి తెలపడం వంటిది) వారిని ఆ రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తులు లేదా బోగీలను జోడించడం ద్వారా గమ్యాలకు చేరుస్తారు. ఇందుకోసం రిజర్వేషన్ ఫారంలో కొత్త ఆప్షన్లను జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తొలుత ఈ విధానానికి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, ఆపై అన్ని రైళ్లకూ వర్తింపజేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.