: హైదరాబాదులో మందుబాబుల 'ఫుల్లు' పండగ!


ఓవైపు వరుస సెలవులు, మరోవైపు దసరా పండగ. ఇంకేముంది, హైదరాబాదులో మందుబాబుల పండగ "మూడు బీర్లు, ఆరు ఫుల్లులు" అన్నట్టు సాగింది. ఇటీవల మద్యం లైసెన్సులు పొందిన వ్యాపారులు కొత్తగా పెట్టుకున్న మద్యం షాపులకు ఈ పండగ అమ్మకాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ నెల 1 నుంచి 21 వరకూ భారీగా అమ్మకాలు సాగినట్టు ఆబ్కారీ శాఖ అధికారులు వివరించారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ. 10 కోట్లకు పైగా సాగిన అమ్మకాలు, దసరా సీజనులో, అంటే, మంగళవారం నుంచి రోజుకు రూ. 20 కోట్లకు పైగా సాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 70 దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రానప్పటికీ, అమ్మకాలు తగ్గకపోవడం గమనార్హం. ఇక బీరు విషయానికి వస్తే, గత 20 రోజుల్లో 7.01 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్లలో అన్ని బ్రాండ్ల మద్యం స్టాక్స్ ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ పండగ సీజన్ అటు ఆదాయ పరంగా తెలంగాణ సర్కారుకు, ఇటు వ్యాపార పరంగా మద్యం షాపుల యజమానులకు, కిక్కు పరంగా మందు బాబులకు ఆనందాన్ని పంచిందనే చెప్పాలి.

  • Loading...

More Telugu News