: ‘హోదా’ను చంద్రబాబు అమ్మేశారు...మోదీ ‘మట్టి’ చల్లిపోయారు: వైఎస్ జగన్ ఆవేదన


రాజధాని కూడా లేకుండా ఓ ముక్కగా మిగిలిన ఏపీకి అటు కేంద్రమే కాక, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీరని అన్యాయం చేస్తోందని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. నిన్నటి అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఏం సాయం చేస్తామన్న దానిపై ఏమాత్రం స్పష్టం చేయకుండానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువస్తారనుకున్న మోదీ, ఒట్టి చేతులతో వచ్చి ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్రానికి అన్ని రకాలుగా మద్దతు లభించేదాకా ఉద్యమం చేద్దామని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ నిన్న సాయంత్రం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను అమ్ముకున్నారని ఆ లేఖలో జగన్ ధ్వజమెత్తారు. తద్వారా ఐదు కోట్ల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. ప్రత్యేక హోదాతో వస్తారనుకున్న మోదీ ఢిల్లీ మట్టి, యమునా నది నీటిని తెచ్చి ప్రజల నోట్లో మట్టి కొట్టిపోయారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సర్కారు, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేటి (శుక్రవారం) నుంచి ఆందోళనలకు దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News