: ఎంత దారుణం...హోదా అడిగితే...నీరు, మట్టి చేతిలో పెడతారా?: కారెం శివాజీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్తకంఠంతో ప్రత్యేకహోదా కోసం అడుగుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రజల నోట్లో మట్టి కొట్టారని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమాఖ్య ప్రధాన కార్యదర్శి కారెం శివాజీ మండిపడ్డారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ వస్తారు...ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తారు...ప్రత్యేకహోదా ఇస్తారు అని ఎన్నో ఆశలు పెట్టుకుంటే... ప్రధాని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఆశలను యమునా నదిలో ముంచారని విమర్శించారు. ప్రధాని ప్రసంగం కేవలం మాటలగారడీ అని, ఆయన వ్యవహారశైలి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదాపై ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.