: స్వైన్ ఫ్లూ మృతురాలి ఖననానికి అడ్డుపడుతున్న గ్రామస్థులు
స్వైన్ ఫ్లూ వ్యాధితో మృతి చెందిన ఒక మహిళను ఖననం చేయడానికి వీల్లేదంటూ గ్రామస్తులు అడ్డుపడిన సంఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ లో జరిగింది. ఆ గ్రామానికి చెందిన పట్ల లక్ష్మి (48) అనే మహిళ స్వైన్ ఫ్లూ తో బాధపడుతోంది. వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చేరింది. వ్యాధి నయం కాకపోడంతో బుధవారం మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన నాగిరెడ్డిపూర్ కు తరలించారు. లక్ష్మి మృతదేహాన్ని ఖననం చేద్దామనుకున్న ఆమె కుటుంబసభ్యులు, భర్త రాజేశంకు గ్రామస్థుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. భయంకరమైన వ్యాధితో ఆమె మృతి చెందిందని, గ్రామంలో ఖననం చేసేందుకు వీల్లేదని గ్రామస్తులు అన్నారు. ఆమె భర్తకు కూడా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు గాను హైదరాబాద్ నుంచి ఆ ఆసుపత్రి వైద్యులు ఆ గ్రామానికి వెళ్లినట్లు సమాచారం.