: 36 వేల టన్నుల పప్పుదినుసులు సీజ్ చేశాం: అరుణ్ జైట్లీ
ఉల్లి ధరలు దిగివచ్చాయని సంబరపడేలోపు పప్పు దినుసుల ధరలు మధ్యతరగతి జీవుడ్ని ఆందోళనలో పడేశాయి. పెరిగిన ధరలను కిందికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పది రాష్ట్రాల్లో బ్లాక్ మార్కెట్ దారులపై దాడులు నిర్వహించిన అధికారులు 36 వేల టన్నుల పప్పు దినుసుల అక్రమ నిల్వలను సీజ్ చేసినట్టు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పప్పు దినుసుల ధరలను నియంత్రించేందుకు విదేశాల నుంచి 5 వేల టన్నుల పప్పు దినుసులను తెప్పిస్తున్నామని అన్నారు. దిగుమతి చేసుకున్న పప్పు దినుసులను రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. కాగా, తమ జీవితంలో కంది పప్పు కేజీ 220 రూపాయలకు చేరడం ఇదే తొలిసారని 65 ఏళ్ల పప్పు దినుసుల వ్యాపారి ఒకరు చెప్పారు. ఇలా అయితే మధ్యతరగతి ప్రజలు ఏం తిని బతుకుతారని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం దళారులు సృష్టించిన కృత్రిమ కొరత అని ఆయన స్పష్టం చేశారు.