: పాక్ క్రికెటర్లు, కళాకారులను అడుగు పెట్టనీయం...మలాలాను మాత్రం ఆహ్వానిస్తాం: శివసేన
పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించవద్దని తేల్చిచెప్పి, పాక్ కళాకారులు, సినీ నటులను ముంబైలో అడుగుపెట్టనీయమని స్పష్టం చేసిన శివసేన మలాలా యుసఫ్ జాయ్ ను మాత్రం సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపింది. హఫీజ్ సయీద్, కసూరీ వంటి వారు భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండగా, పాక్ లోని ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించి, నోబెల్ శాంతి పురస్కారం సాధించిన ధీర వనిత మలాలాను ఘన స్వాగతం పలుకుతామని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. మలాలాకు స్వాగతం పలకడం ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరాదని, భారత్ లో పాకిస్థాన్ అభిమానులకు సందేశం పంపినట్టవుతుందని ఆయన చెప్పారు. కాగా, భారత్ లోని బాలికల్లో స్ఫూర్తి నింపేందుకు ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించాలని ఉందని మలాలా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె వస్తే ఘన స్వాగతం పలుకుతామని శివసేన ప్రకటించడంతో ఆమె పర్యటన ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.