: బెంగళూరు ఐటీ ఇండస్ట్రీలో నయా ట్రెండ్
బెంగళూరు ఐటీ ఇండస్ట్రీలో త్వరలో నయా ట్రెండ్ ప్రారంభం కానుంది. ఐటీ ఇండస్ట్రీలో వారాంతంలో రెండు సెలవులు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల శని,ఆదివారాల్లో షాపింగ్ మాల్స్, పబ్స్, క్లబ్స్, రోడ్లపై రద్దీ పెరిగిపోతోంది. తీవ్ర ఒత్తిడి ఉండే ఐటీ ఉద్యోగులు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో శుక్రవారం పని గంటలు ముగియగానే పబ్ లలో దూరిపోతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో శని, ఆది వారాల్లో రద్దీతో పాటు పలు ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఐటీ ఇండస్ట్రీ సరికొత్త ఆలోచనను తెరమీదికి తీసుకొచ్చింది. వరుసగా రెండు రోజులు సెలువులు ఇచ్చే కంటే వారాంతంలో ఒకరోజు, వారం మధ్యలో ఒకరోజు సెలవు ఇస్తే ఉద్యోగులపై ఒత్తిడి తగ్గడంతో పాటు, రోడ్లపై రద్దీని కూడా నివారించవచ్చని భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు కొన్ని ఐటీ కంపెనీలు ఆమోదం తెలిపాయని బెంగళూరు అదనపు (ట్రాఫిక్) కమిషనర్ ఎంఏ సలీం తెలిపారు. ఈ ప్రతిపాదన వల్ల ఉద్యోగుల్లో సమర్థత పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ విధానం త్వరలోనే అమలు చేయనున్నట్టు సమాచారం.