: 108 ఏళ్ల బామ్మకు అనస్థీషియా లేకుండానే బ్రెయిన్ సర్జరీ !
వయస్సు పైబడిన వారికి శస్త్రచికిత్సలు చేసేందుకు వైద్యులు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటారు. వృద్ధాప్యం కారణంగా శక్తి లేకపోవడంతో శస్త్రచికిత్సను తట్టుకునే శక్తి వారికి ఉండదు. కానీ, రాజస్థాన్ బామ్మ విషయం మాత్రం ఇందుకు మినహాయింపు! ఎందుకంటే, 108 ఏళ్ల వయస్సులో అనస్థీషియా తీసుకోకుండా బ్రెయిన్ సర్జరీ చేయించుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు, ఈ అరుదైన బామ్మ రికార్డును గిన్నీస్ బుక్ లో నమోదుకు పంపాలని వైద్యులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కరౌలి ప్రాంతానికి చెందిన రామోలీదేవి(108) అనే బామ్మ బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతోంది. జయపురలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అందుకు ఆమె ఒప్పుకోవడంతో, అనస్థీషియా ఇవ్వకుండానే ఆపరేషన్ పూర్తి చేశారు. ఆమె మెదడులో ఉన్న రెండు బ్లాక్స్ ని తొలగించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు వైద్యులు. కాగా, గతంలో 104 ఏళ్ల మహిళకు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని వైద్యులు తెలిపారు. తమకు తెలిసినంత వరకు 108 ఏళ్ల వయస్సులో శస్త్రచికిత్స చేయించుకున్నవారు లేరని వైద్యులు చెప్పారు.