: ఇక లాభం లేదు... వెళ్లిపోతున్నా: పీసీబీ చీఫ్
ఎలాగైనా భారత్ తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవాలనే లక్ష్యంలో భారత్ కు విచ్చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ షహర్యార్ ఖాన్ కు నిరాశ మిగిలింది. బీసీసీఐ ఆహ్వానం మేరకు భారత్ లో అడుగుపెట్టిన ఆయనకు శివసేన రూపంలో అవాంతరం ఎదురైంది. బీసీసీఐ హెడ్ క్వార్టర్ కి వెళ్లిన శివసైనికులు... పాకిస్థాన్ తో క్రికెట్ ఆడితే చూస్తూ ఊరుకోమని ఏకంగా బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్ ను హెచ్చరించారు. దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ముంబైలో ఉండటంతో, బీసీసీఐ వెనకడుగు వేసింది. ఈ క్రమంలో, భారత్ కు వచ్చి రెండు రోజులైనా షహర్యార్ ఖాన్ కు బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో, ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక్కడ ఉండి కూడా ప్రయోజనం లేదని భావించిన ఆయన... పాక్ కు వెళ్లిపోతున్నానని తెలిపారు. ఏదేమైనప్పటికి క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కోసం బీసీసీఐ తనను భారత్ కు పిలిపించడం సంతోషదాయకమని షహర్యార్ తెలిపారు. బీసీసీఐపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. అయితే, దక్షిణాఫ్రికాతో నాగ్ పూర్ టెస్టు ముగిసిన తర్వాత పీసీబీని మరోసారి చర్చలకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్ లను షహర్యార్ ఖాన్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.