: రికార్డుల మోత మోగించిన సెహ్వాగ్... ఓ లుక్కేద్దాం
భారత తాజా మాజీ క్రికెటర్, డ్యాషింగ్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ నుంచి ఎన్నో అమూల్యమైన, అద్భుతమైన ఇన్నింగ్స్ జాలువారాయి. ఈ క్రమంలో, ఎన్నో రికార్డులను వీరూ సొంతం చేసుకున్నాడు. అవేంటో మనం ఓసారి చూద్దాం. * ప్రపంచ వ్యాప్తంగా టెస్టుల్లో, వన్డేల్లో ఓపెనర్ గా 7,500కి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్. * టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో ట్రిపుల్ సెంచరీ (278 బంతులు) చేసిన బ్యాట్స్ మన్. * టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 250 పరుగులు (207 బంతులు). * టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెకండ్, థర్డ్ డబుల్ సెంచరీలు. అలాగే టెస్టుల్లో 10 వేగవంతమైన డబుల్ సెంచరీల్లో 5 సెహ్వాగ్ వే. * వన్డే మ్యాచ్ లో మూడో అత్యధిక స్కోరు సెహ్వాగ్ దే. * టెస్ట్ ఇన్నింగ్స్ లో 47 ఫోర్లు బాదిన సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 52 ఫోర్లతో జాన్ ఎడ్రిచ్ తొలి స్థానంలో ఉన్నాడు. * ఒక వన్డే మ్యాచ్ లో అత్యధిక ఫోర్లు (25) బాదిన జాబితాలో సెహ్వాగ్ ది రెండో స్థానం. * వరుసగా 11 సెంచరీలను సెహ్వాగ్ 150+ స్కోరుగా మలిచాడు. * టెస్ట్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు, ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ సెహ్వాగ్. * టెస్టుల్లో 5 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 8 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. * వన్డేల్లో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. సెహ్వాగ్ ను పలు అవార్డులు కూడా వరించాయి. 2002లో అర్జున అవార్డు, 2008, 2009లో విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డులు, 2010లో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2010లో పద్మశ్రీ అవార్డులను సెహ్వాగ్ అందుకున్నాడు.