: ఆ ఐఐఎం లో చదివిన ప్రతి ఒక్కరికీ పోస్టింగ్స్
ఈ సంవత్సరం క్యాంపస్ ప్లేస్ మెంట్లలో లక్నో ఐఐఎం రికార్డు సృష్టించింది. పలు కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్లను ప్రారంభించగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఐఐటీలో తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఖరారయ్యాయి. లక్నోలో ఐఐఎం విద్యను ప్రారంభించిన తరువాత 30 బ్యాచ్ లు పూర్తి కాగా, 31వ బ్యాచ్ లో 100 శాతం ప్లేస్ మెంట్లు సాధించామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు సాగాయని, ఈ సంవత్సరం విద్యను అభ్యసించిన 457 మందీ ఉద్యోగాలు దక్కించుకున్నారని వెల్లడించింది. సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, బిజినెస్ డెవలప్ మెంట్ రంగాలు అత్యధిక ఆఫర్లను అందించాయని పేర్కొంది. వీటితో పాటు ఆపరేషన్స్/సప్లయ్ చైన్, జనరల్ మేనేజ్ మెంట్, సిస్టమ్స్/ఐటీ, మార్కెట్ రీసెర్చ్, అనలిటిక్స్, హెచ్ఆర్ విభాగాల్లోనూ విద్యార్థులు ఉద్యోగాలను పొందారని ప్రకటించింది.