: తెలుగు చిత్రపరిశ్రమకు చంద్రబాబు తాయిలాలు
నవ్యాంధ్రకు వచ్చే తెలుగు చిత్ర పరిశ్రమకు తాయిలాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ యిచ్చారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ‘క్యాపిటల్ సినిమాస్’ మల్టిఫ్లెక్స్ థియేటర్ ను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఆరు స్క్రీన్లు, లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ థియేటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి తరలిరావడానికి తగిన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సినిమా రాజధానిగా విజయవాడ పూర్వవైభవం సంతరించుకుంటుందని, అందుకు ఈ క్యాపిటల్ సినిమాసే నిదర్శనమన్నారు. అమరావతి, విశాఖపట్టణాల్లో స్టూడియోలు నిర్మించాలని, తద్వారా సినీరంగ కళాకారులకు ఉపాధి కల్పించాలని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.