: ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత
ప్రముఖ సినీ హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత మూడు నెలలుగా ఆసుపత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా పాడయిపోయాయి. నిన్న రాత్రి ఆయన కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. చివరి క్షణాల్లో ఊపిరి కూడా తీసుకోలేకపోవడంతో, వెంటిలేటర్ పై ఉంచి ఆయనకు కృత్రిమ శ్వాస అందించారు. చివరకు ఆయనను బ్రతికించడానికి వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. తన కళ్లతోనే అన్ని రకాల భావాలను పలికించిన కళ్లు చిదంబరం... తెలుగు సినీ అభిమానుల మనసులను దోచుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 70 సంత్సరాలు. చిదంబరం మృతి పట్ల సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని వారు అన్నారు. కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరం. కళ్లు చిదంబరం 12 ఏళ్ల పాటు నాటకరంగంలో సేవలందించారు. నాటక రంగ కళాకారుల కోసం విశాఖపట్నంలో 'సకల కళల సమాఖ్య' ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. మొత్తం 1160 మందితో సకల కళల సమాఖ్య ఏర్పాటయింది. విశాఖ పోర్టులో ఆయన ఉద్యోగం కూడా చేశారు. 1988లో 'కళ్లు' సినిమా ద్వారా ఆయన సినీ జీవితం ప్రారంభమయింది. తొలి సినిమాలోనే గొప్ప నటనను ప్రదర్శించి నంది అవార్డును సొంతం చేసుకున్న ఘనత ఆయనది. ఆ తర్వాత కళ్లు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. కొండవీటి దొంగ, చంటి, పెళ్లి పందిరి, అమ్మోరు, ఆ ఒక్కటి అడక్కు, ఎదురులేని మనిషి, మనీ, గోవిందా గోవిందా, శ్వేతనాగు, గ్లామర్, సివంగి లాంటి చిత్రాల్లో ఆయన తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. మొత్తం 300లకు పైగా చిత్రాల్లో ఆయన నటించి, ప్రేక్షకులను మెప్పించారు. చివరగా 'శ్రీసాయి సంకల్పం' అనే చిత్రంలో ఆయన నటించారు. చిదంబరం అంత్యక్రియలు రేపు సాయంత్రం విశాఖలోని శ్మశానవాటికలో జరిగే అవకాశం ఉంది.