: మోదీకి ‘ఆంధ్రా’ స్పెషల్ వంటకాలు...మెనూలో ఉలవచారు ఉండాలని పీఎంఓ ఆదేశం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సర్కారు ‘ఆంధ్రా’ వంటకాలతో కూడిన స్పెషల్ మెనూను సిద్ధం చేసింది. మెనూ ఖరారు విషయంలో ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) కూడా పలు సూచనలు, సలహాలు చేసిందట. అయినా శరన్నవరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న మోదీ సాధారణంగా భోజనం చేయరు. అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏర్పాటు చేసిన స్పెషల్ డిన్నర్ లోనూ మోదీ ముద్ద ముట్టలేదు. కేవలం తన ఆచారం ప్రకారం తేనె కలిపిన నిమ్మరసం మాత్రమే తాగారు. అయితే అమరావతి శంకుస్థాపన రోజున దసరా కావడంతో అదే రోజున మోదీ ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే శంకుస్థాపన కార్యక్రమం ముగిసే సమయానికి మోదీ ఉపవాస దీక్షను విరమిస్తారా? లేదా? అన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. ఒకవేళ మోదీ ఇంకా ఉపవాస దీక్షలోనే ఉంటే కనుక కేవలం తేనె కలిపిన నిమ్మరసంతోనే సరిపెడతారు. అలా కాకుండా ఉపవాస దీక్ష విరమించినట్లైతే మాత్రం, ఆంధ్రా స్పెషల్ మెనూతో మోదీ కుస్తీ పడతారట. ఒకవేళ మోదీ భోజనం చేస్తే, అందులో ఉలవచారు మాత్రం తప్పనిసరిగా ఉండాలని పీఎంఓ అధికారులు సూచించారట.