: సినిమా పరంగా మేమంతా ఒక్కటే: పవన్ కల్యాణ్
'మా ఇద్దరి మధ్య రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నా, సినిమా పరంగా, కుటుంబ పరంగా మేమంతా ఒక్కటే'నని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. అన్నయ్య అంటే తనకెంతో గౌరవమే కాదు, చాలా ఇష్టమని పవన్ అన్నారు. ఈ సందర్భంగా రాజధాని శంకుస్థాపన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలనే ఉంది.. కానీ, షూటింగ్ తేదీలను చూసుకుని ఆలోచిస్తానని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని పవన్ చెప్పారు. రెండు రోజుల క్రితం రాజధాని శంకుస్థాపన ఆహ్వానపత్రాన్ని ఏపీ మంత్రులు స్వయంగా వచ్చి పవన్ కల్యాణ్ కు ఇచ్చివెళ్లిన విషయం తెలిసిందే. అమరావతి శంకుస్థాపనకు వెళ్లే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పవన్ చెబుతున్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం పవర్ స్టార్ అక్కడికి రావాలనే కోరుకుంటున్నారు. అమరావతి శంకుస్థాపన మహోత్సవంతో పాటు తమ అభిమాన నటుడిని చూసి ఆనందించాలని వారు కోరుకుంటున్నారు.