: రాజ్ కోట్ లో రెండు యుద్ధాలు!
ఒకవైపు ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య మూడవ వన్డే పోరు జరుగుతుండగా, గుజరాత్ ప్రభుత్వంపై తన పోరుకు అదే క్రికెట్ స్టేడియాన్ని పటేల్ సంఘం నేత హార్దిక్ వేదికగా నిర్ణయించుకోవడంతో నేడు రాజ్ కోట్ లో రెండు యుద్ధాలు జరుగుతున్నట్టుగా ఉంది. ఒకవైపు మ్యాచ్ కి అధిక సంఖ్యలో పటేళ్లు హాజరై, అంతరాయం కలిగించవచ్చన్న ఆలోచనలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఇప్పుడిప్పుడే స్టేడియంకు అభిమానులు తరలి వస్తున్నారు. వీరిలో పటేళ్లు ఎవరన్నది తెలుసుకునేందుకు పోలీసులు వారి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. వారిపై ఓ కన్నేసేందుకు స్టేడియం నలుమూలలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు మ్యాచ్ చూసేందుకు, ప్రత్యక్ష నిరసన తెలిపేందుకు హార్దిక్ బయలుదేరారని తెలుస్తోంది. దీంతో క్రికెట్ మ్యాచ్ సంగతి ఎలా ఉన్నా, గుజరాత్ ప్రభుత్వానికి సవాలుగా నిలిచిన పటేళ్ల నిరసన ఎటువైపు దారితీస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాజ్ కోట్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ఇప్పటికే అమలులో ఉండగా, స్టేడియానికి కలసి వచ్చే ఏ ఇద్దరు ముగ్గురినీ ఒకే చోట కూర్చోనీయకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.