: చిరంజీవి, ఆయన 150వ చిత్రంపై రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 150వ చిత్రంగా తమిళ సినిమాను రీమేక్ చేయడం తెలుగు ప్రజలను కించపరిచినట్టే అవుతుందని మండిపడ్డారు. ఈ వార్తలు వదంతులు కావాలనే తాను కోరుకుంటున్నానని చెప్పాడు. కేవలం తెలుగు కథతోనే చిరంజీవి 150వ చిత్రాన్ని చేయాలని ఆయన అభిమానులంతా డిమాండ్ చేయాలని పిలుపునిచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమా బాహుబలిని మించి ఉండాలని అభిలషించాడు. ఓవైపు దర్శకుడు రాజమౌళి తెలుగువారి సత్తా చాటుతుంటే... చిరంజీవి మాత్రం తమిళ సినిమాను దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని అన్నాడు. ఇది ముమ్మాటికీ తెలుగువారిని అవమానించినట్టే అవుతుందని చెప్పాడు. తెలుగు సినీ పరిశ్రమలో నిజమైన బ్రూస్ లీ రాజమౌళి అని కొనియాడాడు. చిరంజీవి 150వ సినిమాపై తనదైన శైలిలో వర్మ స్పందించాడు. బ్రూస్ లీనే చిరంజీవి 150వ సినిమా అని స్పష్టం చేశాడు. తన 150వ సినిమాగా బ్రూస్ లీని ఎంచుకోవడం... ప్రజారాజ్యం పార్టీని పెట్టినంత తప్పుడు నిర్ణయమని చెప్పాడు. చిరంజీవి 151వ చిత్రం 'ఎంటర్ ది డ్రాగన్' అవుతుందని ఆశిద్దామని తెలిపాడు.