: అమెరికా గల్లా పెట్టె ఖాళీ అవుతోందా?... తీవ్ర ఆందోళనలో ఒబామా ప్రభుత్వం
అగ్రరాజ్యం అమెరికా ఖజానా ఖాళీగా కనిపించనుందా? ప్రపంచ దేశాలకు పెద్దన్నగానే కాక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు కేంద్ర బిందువైన అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమంటే నమ్మశక్యం కాకున్నా, నమ్మి తీరాల్సిన సందర్భమిది. అమెరికా గడ్డు పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం సాక్షాత్కరించేందుకు మరెంతో సమయం కూడా లేదట. వచ్చే నెల 3 తర్వాత ఆ దేశ ఖజానా ఖాళీగా కనిపించడం దాదాపుగా ఖాయమే. అయితే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిపాదించిన రుణ పరిమితి పెంపునకు ఆయన ప్రత్యర్థి పార్టీ రిపబ్లికన్స్ కు ఆధిక్యం ఉన్న కాంగ్రెస్ కనికరిస్తే మాత్రం, ఈ విపరిణామం నుంచి అమెరికా గట్టెక్కుతుందట. అమెరికా ట్రెజరీ కార్యదర్శి జాకబ్ ల్యూ ఇటీవల కాంగ్రెస్ కు రాసిన లేఖ ఈ విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి 18.1 లక్షల కోట్ల డాలర్ల మేర రుణ పరిమితి ఉంది. అయితే రోజువారీ కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించేందుకు ఈ మేర రుణ పరిమితి అనుమతించడం లేదు. దీంతో ఈ రుణ పరిమితిని మరింత మేర పెంచాలని ప్రభుత్వం కాంగ్రెస్ ను కోరుతోంది. దీనిపై రిపబ్లికన్లను దారికి తెచ్చుకునేందుకు ఒబామా పార్టీ డెమోక్రటిక్ కు చెందిన ప్రతినిధులు అప్పుడే బేరసారాలు మొదలుపెట్టారట.