: పవన్ కల్యాణ్ ను ఆహ్వానించనున్న ఏపీ మంత్రులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన ఆహ్వానపత్రిక అందనుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మంత్రి అయ్యన్న పాత్రుడు, టీడీపీ నేత టీడీ జనార్దన్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ విషయమై పవన్ కల్యాణ్ తో మంత్రి కామినేని ఫోన్లో మాట్లాడారు. రేపు ఉదయం నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో పవన్ ని కలిసి ఆయనకు నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన ఆహ్వానపత్రికను అందజేయనున్నారు. కాగా, అమరావతి శంకుస్థాపన ఆహ్వానాలను అందించడంలో ఏపీ మంత్రులు తలమునకలై ఉన్నారు. వీవీఐపీలు, ప్రముఖులు, అతిథులు, ప్రజలతో పాటు శంకుస్థాపన కార్యక్రమానికి సుమారు 2 లక్షల మంది హాజరవచ్చని అధికారులు చెబుతున్నారు.