: గోమాంసాన్ని సమర్థించిన మహిళా సినీ డైరైక్టర్ కు బెదిరింపులు


బెంగళూరుకు చెందిన కన్నడ సినిమాల అసోసియేట్ డైరైక్టర్, స్ర్కిప్ట్ రచయిత చేతన తీర్థహల్లికి బెదిరింపులు వస్తున్నాయి. నామరూపాలు లేకుండా చేస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెకు ఈ బెదిరింపు మెస్సేజ్ లు వస్తున్నాయి. హిందువుల మత విశ్వాసాలను ప్రశ్నించడంతో పాటు ముస్లింలు గోమాంసం తినడంలో ఎటువంటి తప్పులేదని ఆమె సమర్థించడమే కాకుండా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. అదే సామాజిక మాధ్యమాల ద్వారా తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్ ద్వారా ఈ బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని, అందులో మధుసూదన్ గౌడ్ అనే రీసెర్చి స్కాలర్ కూడా ఉన్నారని చేతన తన ఫిర్యాదులో ఆరోపించింది. ‘యాసిడ్ దాడి చేస్తామని, రేప్ చేస్తామంటూ’ ఆ మెస్సేజ్ లలో ఉన్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తప్పుడు అకౌంట్లతోనే ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తమకు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. కాగా, ముస్లింలు గోమాంసం తినడాన్ని సమర్థిస్తూ బెంగళూరులో ఇటీవల నిర్వహించిన ఒక ర్యాలీలో చేతన పాల్గొన్నారు. హిందూ మత విశ్వాసాలను విమర్శిస్తూ పత్రికల్లో పలు వ్యాసాలు కూడా ఆమె రాశారు.

  • Loading...

More Telugu News