: శ్రీవారి ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆగ్రహం!
తిరుమల వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, వాహన సేవల్లో తాను విధులను అప్పగించిన వారిని తొలగించిన అధికారుల తీరు పట్ల ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహ వాహన ఊరేగింపు సందర్భంగా వాహనాలపై నిలబడాల్సిన వారిని ఎలా మారుస్తారని ఆయన ఆలయ పేష్కార్ ను ప్రశ్నించారు. తాను ఒక అర్చకుడికి డ్యూటీ వేసిన తరువాత, అతనిని మారిస్తే, తనను అవమానించినట్లే కదా? అని మండిపడ్డారు. గురువారం నాటి సేవల్లో డ్యూటీలు చేసిన వారే ఈ ఉదయం కనిపించడంతో ఆయన అసహనానికి గురయ్యారు. అందరు అర్చకులకు అవకాశం లభించేలా తాను నిర్ణయాలు తీసుకుంటుంటే, పేష్కార్ దాన్ని మార్చడమేంటని ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనతో అర్చకులు, ఆలయ అధికారుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయట పడ్డట్లయింది.