: అమేజాన్ ప్రచారంపై తమిళనాట నిరసన సెగలు
13 నుంచి 17 మధ్య అమేజాన్ లో వస్తువులను కొనుగోలు చేసిన వారిని భాగం చేస్తూ, లక్కీ డ్రా తీసి కిలో బంగారాన్ని బహుమతిగా ఇస్తామని ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ చేస్తున్న ప్రచారంపై తమిళనాట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పత్రికల ద్వారా ప్రకటనలు గుప్పించి, కోట్లాది రూపాయల ఆర్డర్లను పొందిన సంస్థ, ఆపై డ్రాలో తమిళనాడు వాసులకు అనుమతి లేదని చెప్పడం, తమిళ ప్రజలను మోసం చేయడమే అవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. అమేజాన్ ప్రారంభించిన అమ్మకాల ప్రమోషన్ నిమిత్తం ఫ్రంట్ పేజీ యాడ్స్ ఎన్నో ఇచ్చిన ఆ సంస్థ అసలు విషయాన్ని మరవడమే ఈ నిరసనలకు కారణమైంది. ఈ తరహా ప్రైజ్ స్కీములు తమిళనాడులో నిషేధం. ప్రకటనలు జారీ చేసే సమయంలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి వుంటుంది. ఆ విషయాన్ని అమేజాన్ మరచిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సంస్థ యాజమాన్యం, డ్రాకు తమిళనాడు కస్టమర్లు అర్హులు కారని వెల్లడించగానే నిరసనలు మొదలయ్యాయి. దీనిపై తంతై పెరియార్ డ్రావిడర్ కజగం పోలీసు ఫిర్యాదు కూడా ఇచ్చింది. తక్షణం ప్రభుత్వం కల్పించుకుని అమేజాన్ పై చర్యలు తీసుకోవాలని పట్టాలి మక్కై కచ్చి నేత టీ వేలుమురుగన్ డిమాండ్ చేశారు.