: వెనక్కు తగ్గని హార్దిక్...‘రాజ్ కోట్’ టికెట్లలో మెజారిటీ వాటాను పటేళ్లు కొనేశారట!
‘‘ఈ మ్యాచ్ ఒక్క భారత్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. దయచేసి ఆందోళనలు చేయొద్దు’’ ఇదీ గుజరాత్ పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టిన హార్దిక్ పటేల్ కు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం చేసిన వినతి. ఈ వినతి హార్దిక్ పటేల్ చెవులకు ఏమాత్రం ఎక్కలేదు. రాజ్ కోట్ లో ఈ నెల 18న జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కు పెద్ద సంఖ్యలో హాజరై నిరసనలతో హోరెత్తించాలన్న హార్దిక్ ఆజ్ఞను గుజరాత్ పటేళ్లు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇప్పటికే మ్యాచ్ కు సంబంధించి టికెట్లలో మెజారిటీ వాటాను పటేళ్లే కొనుగోలు చేశారట. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ అనంతరం జరిగే బహుమతుల ప్రదానోత్సవానికి గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పటేళ్ల నిరసనలు ఎక్కడ తమను ఇబ్బంది పెడతాయోనని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం ఆందోళన చెందుతోంది.