: రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం జగన్: మంత్రి దేవినేని
రైతుల నుంచి భూములు లాక్కొనే అలవాటు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లకే ఉందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినట్లు అందరికీ తెలిసిందేనని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రతిపక్షనేతగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని ఆయన మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు రావద్దంటూ సింగపూర్, జపాన్ దేశాలకు లేఖలు రాసిన జగన్ ఈవిధంగా తన అక్కసు వెళ్లగక్కారంటూ మంత్రి మండిపడ్డారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తాను రాలేనంటూ తన దుర్మార్గాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. కాగా, అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తాను రానంటూ జగన్ లేఖ రాసిన నేపథ్యంలో పలువురు మంత్రులు ఇప్పటికే ఆయనపై విమర్శలు గుప్పించారు. నవ్యాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేలా జగన్ వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించిన విషయం తెలిసిందే. రాష్ట్రాభివృద్ధికి జగన్ ఏమాత్రం సహకరించడం లేదని ఆయన అన్నారు.