: రోబో-2, రజనీకాంత్ రూ. 50 కోట్లు తీసుకుంటుంటే... రూ. 100 కోట్లు తీసుకుని నటిస్తున్న నటుడెవరో తెలుసా?
నాలుగేళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన శంకర్-రజనీకాంత్ ల అద్భుత సృష్టి 'రోబో'కు ద్వితీయ భాగం తయారవుతోందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి ఆ చిత్రంపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్న ఓ హాలీవుడ్ దిగ్గజం అందుకు రూ. 100 కోట్లను ప్రతిఫలంగా అందుకోనున్నాడన్న వార్త భారత సినీ పరిశ్రమలో గుప్పుమంది. సినీ హీరో రజినీకాంత్ కు ఇస్తున్నదే రూ. 50 కోట్లని ఇప్పటికే వార్తలు రాగా, రూ. 100 కోట్లు తీసుకుంటున్న నటుడు ఎవరు? అని ఆలోచిస్తున్నారా? హాలీవుడ్ దిగ్గజం, టెర్మినేటర్ హీరో ఆర్నార్డ్ స్వార్జ్ నెగ్గర్ అట. ఈ సినిమాలో ఆర్నాల్డ్ నటిస్తే వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తుందని, సినిమా ప్రమోషన్ సులభమవుతుందని భావించిన దర్శకుడు శంకర్, అందుకు ఆర్నాల్డ్ ను ఒప్పించడంతో పాటు, ఇంతవరకూ ఏ భారత నటుడూ అందుకోని పారితోషికాన్ని ఆఫర్ చేసి, ఆయన్ను ఒప్పించినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే, ఈ చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం. దాంతో పాటు ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తయారైన చిత్రంగా 'బాహుబలి' పేరిట ఉన్న రికార్డు కూడా తుడిచిపెట్టుకు పోవడం ఖాయమే! ఇప్పటికైతే ఆర్నాల్డ్ నటిస్తున్నాడన్న వార్తలు ఊహాగానాలే. దీనిపై అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ సస్పెన్స్ భరించక తప్పదు.