: ఇక సెలవ్... అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జహీర్ ఖాన్


భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ చెప్పేశాడు. ఈ మేరకు అతడు కొద్దిసేపటి క్రితం బీసీసీఐకి సమాచారం ఇవ్వడంతో పాటు ఐపీఎల్ చైర్మన్ రాజీశ్ శుక్లాకు ఫోన్ చేసి తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. 2000, అక్టోబర్ 3న నైరోబీలో కెన్యాతో జరిగిన వన్డేతో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్ సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ కు ఎనలేని సేవలందించాడు. 200 వన్డేలు ఆడిన జహీర్ 282 వికెట్లు తీశాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే పది ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన జహీర్, 48 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. టెస్టు క్రికెట్ లో 92 మ్యాచ్ లు ఆడిన జహీర్ 311 వికెట్లు నేలకూల్చాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా అతడు రికార్డులకెక్కాడు. టెస్టుల్లో 11 సార్లు 5 వికెట్లు, ఓ సారి 10 వికెట్లు తీసి సత్తా చాటాడు. పొట్టి క్రికెట్ టీ20ల్లో 17 మ్యాచ్ లు ఆడిన జహీర్ ఖాన్ 17 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో భారత్ టైటిల్ సాధించడంలో జహీర్ కీలక భూమిక పోషించాడు. భారత్ కు చిరస్మరణీయమైన ఆ సిరీస్ లో జహీర్ ఒక్కడే 21 వికెట్లను నేలకూల్చాడు. భారత క్రికెట్ నుంచి దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్, ఆ తర్వాత జవగళ్ శ్రీనాథ్ ల నిష్క్రమణ తర్వాత భారత బౌలింగ్ కు జహీర్ ఖాన్ వెన్నెముకగా నిలిచాడు. 2012 ఆగస్టు వరకు భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న జహీర్ ఆ తర్వాత గాయాల కారణంగా క్రమంగా చోటు కోల్పోయాడు. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడుతున్న జహీర్ అక్కడ కూడా తన సత్తాను చాటాడు.

  • Loading...

More Telugu News