: భారీ నష్టంలో టీసీఎస్... అదే దారిన కెయిర్న్ ఇండియా, జీ ఎంటర్ టెయిన్ మెంట్
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా లేని ఫలితాలను వెల్లడించిన ఐటీ దిగ్గజం టీసీఎస్ తో పాటు పలు కంపెనీల ఈక్విటీలకు అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించడంతో స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగాయి. ఎఫ్ఐఐలతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థలు తమ ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపినట్టు బీఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి. సెషన్ ఆరంభం నుంచి ఒడిదుడుకుల్లో సూచికలు సాగాయి. బుధవారం సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 66.87 పాయింట్లు పడిపోయి 0.25 శాతం నష్టంతో 26,779.66 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 23.80 పాయింట్లు పడిపోయి 0.29 శాతం నష్టంతో 8,107.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 98,63,210 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.34 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.35 శాతం లాభపడింది. ఎన్ఎస్ఈ-50లో టీసీఎస్ 4.53 శాతం, కెయిర్న్ ఇండియా 3.52 శాతం, జడ్ఈఈఎల్ 3.51 శాతం, హిందుస్థాన్ యూనీలివర్ 2.79 శాతం, టెక్ మహీంద్రా 2.56 శాతం నష్టపోయాయి. ఇదే సమయంలో హిందాల్కో 2.84 శాతం పెరిగింది. దీంతో పాటు ఏసీసీ, లుపిన్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీలు స్వల్ప లాభాల్లో నిలిచాయి.