: ఐఫోన్ ‘బంగార’మాయెనే!...ఢిల్లీ ఎయిర్ పోర్టు టాయిలెట్ లో 22 ఐఫోన్ 6ఎస్ లు


నిజమేనండోయ్, బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో విదేశాల నుంచి భారత్ లోకి బంగారం అక్రమ మార్గాల్లో తరలివస్తోంది. నిత్యం దేశంలోని ఏదో ఒక ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడుతూనే ఉంది. హైదరాబాదులోని శంషాబాదు ఎయిర్ పోర్టులోనైతే ఈ తరహా పట్టివేతలు నిత్యకృత్యమైపోయాయి. ఐఫోన్లను కూడా కొందరు ‘బంగారం’గానే భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ ఫోన్ల సిరీస్ లో తాజా మోడళ్లు ఐఫోన్ 6ఎస్ , 6 ఎస్ ప్లస్ లు అమెరికా తదితర దేశాల్లోని మార్కెట్లలోకి వచ్చేశాయి. మన దేశ మార్కెట్లోకి ఈ నెల 16న ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే వినియోగదారుల చేతికి చిక్కేందుకు మాత్రం మరింత సమయం పడుతుందట. ఈ క్రమంలో ఐఫోన్లపై స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఉండే ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. దుబాయి నుంచి వచ్చిన విమానంలో నేటి ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి 22 ఐఫోన్ 6ఎస్ లను తీసుకొచ్చాడు. అయితే కస్టమ్స్ అధికారుల గట్టి నిఘా నేపథ్యంలో అతడు సదరు ఫోన్లను ఎయిర్ పోర్టులోని టాయిలెట్ లో దాచాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా, టాయిలెట్ లోని ఐఫోన్లు పట్టుబడ్డాయి.

  • Loading...

More Telugu News