: అమరావతి శంకుస్థాపనలో మోదీ పూజలు...విరాళాల కోసం పిలుపు కూడా ఇస్తారట!


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిజంగా మరిచిపోలేనిదిగానే ఉండబోతోంది. రాజధానికి శంకుస్థాపన చేసేందుకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దాదాపు 15 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేస్తారట. దాదాపు పావు గంట పాటు జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మోదీ రత్నన్యాసం, శిలన్యాసం పూజలు చేస్తారట. ఈ మేరకు శంకుస్థాపనలో పాల్గొననున్న మోదీ ఏఏ తరహా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్న అంశంపై గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్, ఆ తర్వాత కొంత దూరం కారులో మోదీ శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకుంటారు. శంకుస్థాపన ప్రాంతంలో ప్రధానికి పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి మోదీ కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత హోమగుండంలో ద్రవ్యాలు వేస్తారు. సిద్ధాంతితో కలిపి ముగ్గురు పురోహితులకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. హోమ ద్రవ్యాలు వేసిన తర్వాత ఇక వెనుతిరిగి చూడకూడదని పండితులు సూచించారు. ఈ మేరకు ప్రధాని ముందుకు సాగుతూ ఉండాలి. ఆ తర్వాత రత్నాలను స్వహస్తాలతో మోదీ హోమగుండంలో వేస్తూ రత్నన్యాసం కార్యక్రమంలో పాల్గొంటారు. రత్నన్యాసం పూర్తవగానే శిలన్యాసం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది జరుగుతుండగానే వేద పండితులు మోదీకి ఆశీర్వచనం ఇస్తారు. ఇంతటితో పూజ ముగుస్తుంది. ఆ తర్వాత మోదీ వెనుకకు చూడకుండా శంకుస్థాపన ప్రాంతం నుంచి బయటకు వస్తారు. అనంతరం జరిగే కార్యక్రమంలో ప్రసంగించనున్న మోదీ రాజధాని నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తారు.

  • Loading...

More Telugu News