: రూ. 800తో 'గూగుల్.కాం'ను కొనేసిన ఎంబీయే విద్యార్థి వేద్
సెర్చింజన్ వెబ్ దిగ్గజం గూగుల్ డొమైన్ సర్వీసుల్లోని సెక్యూరిటీ లోపాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. యూఎస్ లోని ఓ కాలేజీలో ఎంబీయే విద్యను అభ్యసిస్తున్న వేద్ అనే విద్యార్థి ఏకంగా 'గూగుల్.కాం'ను 12 డాలర్లకు (సుమారు రూ. 800) కొనేశాడు. ఆ వెంటనే 'గూగుల్.కాం' వెబ్ సైట్ ఇక వేద్ సొంతమని మెయిల్ కూడా వచ్చింది. గూగుల్ వెబ్ అడ్మినిస్ట్రేషన్ టీం మధ్య బట్వాడా అయ్యే ఈ-మెయిల్స్ రావడం మొదలైంది. మరో నిమిషం తరువాత జరిగిన తప్పును తెలుసుకున్న గూగుల్ యాజమాన్యం ఈ లావాదేవీ పొరపాటున జరిగిందని చెబుతూ, దీన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. వేద్ కు భారీ ఎత్తున నగదును పరిహారంగా ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మొత్తం ఎంతన్న విషయం వెల్లడికాలేదు గానీ, ఈ పరిహారం వందల కోట్ల రూపాయల్లో ఉందని సమాచారం. ఈ డబ్బును తాను ఇండియన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ కు ఇస్తానని వేద్ వెల్లడించడంతో, తామివ్వాలనుకున్న మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్టు గూగుల్ యాజమాన్యం ప్రకటించింది. తాను సెప్టెంబర్ 29న గూగుల్.కాం అమ్మకానికి ఉన్నట్టు గుర్తించి ఆ వెంటనే తన క్రెడిట్ కార్డు ద్వారా దాన్ని కొనుగోలు చేశానని వేద్ తెలిపారు.