: కొండారెడ్డిపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్న ప్రకాశ్ రాజ్
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లి గ్రామంలో సేవలను ప్రారంభించారు. గ్రామస్థుల ఆరోగ్య పరీక్షల నిమిత్తం వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు సన్ షైన్ ఆసుపత్రి వైద్యులతో ఆయన చర్చించారు. ఈ మేరకు వారితో జరిగిన చర్చలపై ట్విట్టర్లో తెలిపారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తన దత్తత గ్రామాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని తెలిపిన ఆయన, తొలి ప్రయత్నంగా గ్రామస్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు సన్ షైన్ ఆసుపత్రి వైద్యులైన డాక్టర్ గురవారెడ్డి బృందంతో చర్చలు జరిపి, ప్రణాళికను రూపొందించారు. త్వరలో ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.