: రాజ్యం సాగేది తుపాకీ గొట్టంతోనే కదా?: వరవరరావు సంచలన వ్యాఖ్యలు
రాజ్యం సాగేది తుపాకీ గొట్టంతోనేనని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధ్యమా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రస్తుత ప్రభుత్వాలు రాజ్యాధికారం సాగించేది తుపాకీ గొట్టంతోనేనని అన్నారు. దీనిని ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా ఇది వాస్తవమని ఆయన చెప్పారు. నిన్న తెలంగాణలో అఖిలపక్షం నిర్వహించిన బంద్ ను ప్రభుత్వం తుపాకీ గొట్టంతోనే అణచివేసిందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తిన ప్రతిసారీ తుపాకీ గొట్టమే సమాధానం చెబుతుందని ఆయన తెలిపారు. తుపాకీ గొట్టం లేకపోతే ప్రభుత్వాలు ఒక్క క్షణం కూడా పనిచేయలేవని ఆయన అన్నారు. అలాంటి ప్రభుత్వాలు ప్రజల పక్షాన పోరాడే వారిని మావోయిస్టులు, అరాచకవాదులు అని ముద్ర వేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులకు రక్షణ ఎందుకు? అని ఆయన అడిగారు. భద్రత స్టేటస్ సింబలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా సేవ చేస్తామనే వారికి స్టేటస్ సింబల్ ఎందుకు? అని ఆయన నిలదీశారు. ప్రభుత్వాలు అమలు చేసేది తుపాకీ గొట్టాల రాజ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.