: బౌండరీలతో విరుచుకుపడ్డ డివిలియర్స్...భారత్ ముందు 304 పరుగుల భారీ లక్ష్యం


సఫారీ కెప్టెన్ డివిలియర్స్ జూలు విదిల్చాడు. స్లాగ్ ఓవర్లలో వీర విహారం చేశాడు. బౌండరీలతో భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. వెరసి టీమిండియా ముందు 304 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచాడు. 41 ఓవర్ల దాకా మందకొడిగా సాగిన సఫారీల బ్యాటింగ్ ఆ తర్వాత జోరందుకుంది. జట్టు స్కోరు 200 మైలు రాయి దాటగానే అప్పటిదాకా కాస్త నింపాదిగా ఆడిన డివిలియర్స్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. 43 వ ఓవర్ ముగిసేసరికి 58 పరుగుల వ్యక్తిగత స్కోరుతో క్రీజులో ఉన్న డివిలియర్స్ మరో 7 ఓవర్లు ముగిసేసరికి తన స్కోరును సెంచరీ దాటించి 104 పరుగులకు చేర్చుకున్నాడు. అదే విధంగా జట్టు స్కోరును కూడా అతడు 303 పరుగులకు చేర్చాడు. సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలింగ్ పై ముప్పేట దాడి చేసిన డివిలియర్స్ చివరి బంతిని సిక్సర్ గా మలిచాడు. కేవలం 73 బంతుల్లో 104 పరుగులు చేసిన డివిలియర్స్ నిజంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ మిల్లర్ (13) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జేపీ డుమిని (15) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా, అతడి స్థానంలో బరిలోకి దిగిన బెహ్రదీన్(35) కెప్టెన్ కు మంచి సహకారం అందించాడు. డివిలియర్స్ తన ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు, ఆరు సిక్స్ లను బాదాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో సఫారీలు ఐదు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేశారు. మరికాసేపట్లో 304 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా తన ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News