: బంతిని తిప్పేసిన అశ్విన్... సఫారీ తొలి వికెట్ డౌన్
టీ20 మాదిరిగానే వన్డేలోనూ భారత సీమర్లు అంతగా రాణించేలా కనిపించడం లేదు. కాన్పూర్ లో నేటి ఉదయం ప్రారంభమైన వన్డే మ్యాచ్ లో పరుగుల వరదను కాస్తంత నిలువరించగలిగిన భారత ఫాస్ట్ బౌలర్లు వికెట్లు మాత్రం పడగొట్టలేకపోయారు. అయితే టీ20ల్లో సత్తా చాటిన చెన్నై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం బంతిని తిప్పేశాడు. 8 ఓవర్ల పాటు సీమర్లను పరీక్షించిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ 9వ ఓవర్ లో అశ్విన్ కు బంతినిచ్చాడు. వచ్చీరాగానే అశ్విన్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తాను వేసిన నాలుగో బంతికే సఫారీ ఓపెనర్ డికాక్ (29) ను బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతిని స్లిప్స్ లోకి బంతిని నెట్టాడు. అయితే కీపింగ్ చేస్తున్న కెప్టెన్ పక్కనే ఎప్పుడెప్పుడు బాల్ వస్తుందా అని ఎదురుచూస్తున్న సురేశ్ రైనా ఆ క్యాచ్ ను ఒడిసిపట్టేశాడు. దీంతో డికాక్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి సఫారీలు 56 పరుగులు చేశారు. డికాక్ తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన హషీమ్ ఆమ్లా (19) పరుగులతో క్రీజులో ఉన్నాడు. వన్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన డూప్లెసిస్ (6) పరుగులు చేశాడు.