: బాలల హోం వర్క్ లో భాగంగా 'సూసైడ్ నోట్'!


'విహార యాత్ర అనుభవాలు రాయండి, లేదా ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలపై అభిప్రాయాలు రాయండి' అంటూ హోం వర్క్ ఇవ్వడం సర్వసాధారణం. కానీ ఇంగ్లండ్ లోని ఓ పాఠశాల 'సూసైడ్ నోట్'ను హోం వర్క్ గా ఇచ్చి కలకలం రేపింది. ఎసెక్స్ లోని విక్ ఫోర్డ్ లోని బ్యూచాంప్స్ హైస్కూలు విద్యార్థులకు ఓ ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు. అందులో భాగంగా ఓ పాఠంలోని 'ది లాస్ట్ జర్నీ' పేరిట సూసైడ్ కు ముందు కలిగే ఆలోచనలు రాసి తీసుకురావాలని హోం వర్క్ ఇచ్చారు. ఈ హోం వర్క్ అంశం చూసిన బాలల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండా 15 ఏళ్లు కూడా లేని పిల్లలకు ఇలాంటి హోం వర్క్ లు ఇస్తే, వారిలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వీరంతా కలసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై ఆ హోం వర్క్ ఇచ్చిన టీచర్ మాట్లాడుతూ, స్కూలు సిలబస్ లో ఉన్నవాటిపైనే తాము హోం వర్క్ ఇస్తామని, పాఠ్యాంశంలో ఉన్న అంశంపైనే తాను హోం వర్క్ ఇచ్చానని, ఇందులో తన తప్పేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News