: 'జజ్బా' మూవీ ఎలా వుందంటే...!
సినీ పరిశ్రమలో నటులకు సెకండ్ ఇన్నింగ్స్ అనేది చాలా కీలకం. ఇప్పుడు కొత్తగా చేసే పాత్రల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, అందాల భామ ఐశ్వర్యరాయ్ వివాహం చేసుకుని, ఓ పాపకు జన్మనిచ్చిన తరువాత ఐదేళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమా చేయడానికి ఆచూతూచి అడుగులు వేసింది. సౌత్ కొరియన్ ఫిలిం 'సెవెన్ డేస్' ఆధారంగా తెరకెక్కించిన 'జజ్బా'తో ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినీ పరిశ్రమలో, అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓసారి ఈ సినిమా విశ్లేషణలోకి వెళితే, ముంబైలో అనురాధ వర్మ (ఐశ్వర్యరాయ్) ప్రముఖ క్రిమినల్ న్యాయవాది. తన ప్రొఫెషన్ లో విజయవంతంగా ముందుకెళుతుంటుంది. భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్న ఆమెకు సాన్యా (సారా అర్జున్) అనే కుమార్తె. ఓరోజు అకస్మాత్తుగా సాన్యాను ఎవరో కిడ్నాప్ చేస్తారు. అప్పటికే సియా (ప్రియా బెనర్జీ) అనే యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నవాజ్ అనే వ్యక్తి జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. అనురాధ కూతురును వదిలిపెట్టాలంటే జైలులో ఉన్న నవాజ్ తరపున కేసు వాదించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తారు. చేసేదిలేక అనురాధ వాదించడానికి ఒప్పుకుంటుంది. ఈ సమయంలో ఆమె స్నేహితుడు, అప్పటికే సస్పెండ్ అయిన యోహన్ (ఇర్ఫాన్ ఖాన్) అనే పోలీస్ అధికారి సహాయం చేసేందుకు ముందుకొస్తాడు. ఇలా స్నేహితుడి సహాయంతో కిడ్నాపర్ల నుంచి కుమార్తెను కాపాడుకోవడానికి అనురాధ సమస్యలను ఎలా ఎదుర్కొంటుంది? అనేది సినిమాలో మిగతా కథ. రీఎంట్రీలో ఐశ్వర్య వయసుకు తగిన కథను ఎంచుకుందని, ఇన్నాళ్ల గ్యాప్ తరువాత కూడా తన నటనలో సత్తా చూపిందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా క్రిమినల్ లాయర్ పాత్రకు ఐష్ పూర్తి న్యాయం చేసిందని చెబుతున్నారు. ఇంతవరకు ఐశ్వర్యను గ్లామర్ గా చూసినవాళ్లకు ఆమెలోని మరో కోణాన్ని చూపేందుకు ఈ చిత్రం బాగా ఉపయోగపడిందని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా కూతురు కిడ్నాప్ అయినా బలవంతంగా కేసు వాదించే న్యాయవాదిగా తన ఎమోషన్స్ ను బాగా పండించిందని ప్రశంసిస్తున్నారు. ఇక ఇర్ఫాన్ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని, ఆ పాత్రకు తాను తప్ప మరెవరూ న్యాయం చేయరన్న విధంగా నటించాడని మెచ్చుకుంటున్నారు. సీనియర్ నటి షబానా అజ్మీ కూడా తన శైలి నటనతో మెప్పించిందంటున్నారు. మిగతా పాత్రల్లో జాకీ ష్రాఫ్, బేబీ సారా అర్జున్, అతుల్ కులకర్ణీ, సిద్ధాంత్ కపూర్ తమ పాత్రల మేరకు న్యాయం చేశారనే చెప్పచ్చు. ఈ సినిమాకు రాబిన్ భట్, కమలేష్ పాండేలు రాసిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయని, కథకు బాగా ఉపయోగపడ్డాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఓ కొరియన్ చిత్రం ఆధారంగా రీమేక్ చేసినా ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా మలచటంలో దర్శకుడు సంజయ్ గుప్తా సక్సెస్ సాధించారని ప్రశంసలందుతున్నాయి. చిత్రం ప్రథమార్థం చివరలో కొంచెం నెమ్మదిగా సాగినా... ద్వితీయార్థం బాగుందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయని చెప్పచ్చు. సినిమాకు ఆడియో అంతగా ప్లస్ అవకపోయినా, ఓ థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఐష్ కు మంచి మార్కులు పడితే, నిర్మాత నుంచి దర్శకుడిగా మారి మొదటిసారి సంజయ్ చేసిన ప్రయత్నానికి ఫలితం లభించిందని చెప్పాలి.