: తెలంగాణ బంద్ లో అరెస్టైన కాంగ్రెస్ నేతలకు జానారెడ్డి సంఘీభావం
తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ లోని గోషా మహల్ వద్ద అరెస్టైన తమ పార్టీల నేతలను టి.సీఎల్పీనేత జానారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం అన్ని పక్షాలు ఒకటి కావటం శుభపరిణామమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి ఇక ముందు కూడా విపక్షాలు ఐక్యత చాటుకోవాలని జానా కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జైళ్లకు వెళ్లడానికైనా తాము వెనుకాడమని స్పష్టం చేశారు. బంద్ ను విఫలం చేసేందుకు భయపెట్టి, బలవంతం చేసి దుకాణాలను మళ్లీ తెరిపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. నేటి బంద్ లో పాల్గొనలేదంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో జానా కాంగ్రెస్ నేతల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.