: మాకెలాంటి బిజినెస్సులు లేవు...ప్రజా సమస్యలపై పోరే మా అజెండా: జగన్ దీక్షలో సీపీఎం మధు
సీపీఐ (ఎం) సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ కార్యదర్శి పి.మధు కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులోని నల్లపాడులో చేపట్టిన నిరవధిక దీక్షకు మధు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల నేతల మాదిరిగా కమ్యూనిస్టు పార్టీ నేతలకు బిజినెస్సులు ఏమీ లేవని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాలను మేల్కొలుపుతూ పోరాటాలు చేయడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీకి కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరు సాగిస్తున్న వైసీపీకి, దీక్ష చేస్తున్న ఆ పార్టీ అధినేత జగన్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆసక్తి కనబరచడం లేదని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరించిన తీరును కూడా మధు తప్పుబట్టారు. రాజధాని కోసం సేకరించిన భూములను విదేశీ సంస్థలకు చంద్రబాబు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు.